Google+ Consumer Psyche: ఉగాది

Leader

Tuesday, March 16, 2010

ఉగాది

బొబ్బట్లు, అరిసెలు, పాయసం, పులిహోర అప్పుడే కోసిన అరిటాకు మీదపెట్టి వడ్డించడం. పట్టు పరికిణి -పావడ, నుదుటి మీద పాపిడి బిళ్ళ, మెడలోఅమ్మమ్మ హారం, చేతికి గాజులు, నడుముకు వడ్డాణం, చెవులకు దుద్దులు, పూల జడ, అన్నింటికన్నా మెరిసిపోయే నవ్వు, ఆనందంతో వెలిగిపోతున్నతొర్రిపళ్ళ చెల్లి. కాళ్ళకి పారాణి, కొత్త పట్టుచీర కట్టుకుని, ఉదయాన్నే తలంటి, కొత్త కుండలో మామిడి పిందెల ముక్కలు, చింతపండు, బెల్లం, ఉప్పు, పచ్చిమిరపకాయ లాంటి ఆరు రుచులను కలిపి, అరచేతిమీద వేసుకుని రుచిచూసి కాసేపు పక్కన పెట్టి పిల్లల్నందరినీ... 'ఆగండర్రా! కొంచెం ఊరనియండోయ్,' అని అరుస్తుంటే, 'కొంచెమే అమ్మా, రుచి చూస్తాం,' అంటూ రుచి చూడడం, సగం కుండ ఖాళీ చేయడం. ఉదయాన్నే అమ్మ పోరు పడలేక ఆఫీసులేకపోయినా త్వరగానే లేచి పేపర్ కూడా చదవకుండా స్నానం చేసి హిట్లర్ చేతిలో చిక్కుకున్నట్లు నిద్రకళ్ళతో టీతాగుతున్న నాన్న.

చేతుల నిండా బొబ్బట్లు తీసికొని బయటికి పరిగెడుతూ , అప్పుడే వేడినీళ్ళ స్నానం చేయించిన చంటాడు సాంబ్రాణి పొగకు కళ్ళు మంట పెట్టి ఏడుస్తుంటే వెళ్లి, వాడ్ని ముద్దు పెట్టుకుని బుగ్గ గిల్లి బయటకు పరిగెత్తి స్నేహితులందరికీ పప్పులుపెట్టటం, వాళ్ళు తెచ్చినవి తినడం. అలసి పోయేవరకు ఊరి వీధిలో ఆడుకుని ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుని అమ్మపెట్టిన వంటలు, తిట్లు తిని మళ్లీ బయటకు పరుగెత్తి పక్కింట్లో పూర్ణాలు తిని సందులో షికార్లు కొట్టి,
వేసవి ఎండలోమామిడి చెట్ల క్రింద పిందెలు రాల్పడం కోసం తిరగడం. ప్రక్క సందులో స్రవంతి, పార్వతి, భాను, ప్రతిమ వాళ్ళ యిళ్ళముందు సైకిల్ తొక్కుతూ సైట్ కొట్టి వాళ్ళ నాన్నలు పట్టుకుని కొట్టే రేంజ్లో లుక్ యిచ్చాక వెనక్కు రావడం. ఇదిచిన్నప్పుడు ఉగాది అంటే.

షడ్రుచులు కొత్తదనం లైఫ్ లో ఏదైనా నవ్వుతూ ఆహ్వానించాలి. జీవితంలో కొంచెం చెడు, కొంచెం తీపి, కొంచెంపులుపు, కొంచెం ఉప్పు , కొంచెం కారం ఇలా అన్ని రుచులసమ్మేళనం ఉంటేనే మృదుత్వం ప్రేమ, మనదగ్గర ఉన్నదాన్నిమెచ్చుకునే అభిమానించే అవకాశం అని నేర్పించేదే ఉగాది. అలసిపోయి ప్రయాణిస్తున్న బ్రతుకులో కొంచెం ఊరట ప్రేమ ఉంటె ఎంత మధురంగా ఉంటుందో నేర్పిస్తుంది ఉగాది. పిజ్జాలు, బుర్గేర్ లు, మచీనులో నుంచి వచ్చే కఫ్ఫీలు తాగి, ఏసి గదిలో, అద్దాల మేడలో, చెక్క ఆఫీసులో కుర్చునిపనిచేయటం, డబ్బువేనకాల పరిగెత్తుతూ ప్రేమ ఆప్యాయత, అమ్మ, నాన్న, ఇల్లు, సంస్కృతి మర్చిపోయవడం జీవితంకాదు. అప్పుడప్పుడు ఆవకాయ పచ్చడి తగిలితే అమ్మ చేతి గోరుముద్దలు గుర్తొచ్చినట్లు, మన సంప్రదాయం, అలవాట్లూ, కట్టుబాట్లూ అన్నిటిని గుర్తు తెస్తుంది ఉగాది. ప్రేమ అభిమానం ఆప్యాయత అంటే కాలాలు కష్టాలు వచ్చినా మారవు అని చెప్తుంది ఉగాది.

అవన్నీ సర్లే కాని 'అమ్మా! బొబ్బట్లు రవ్వుండలు ఎక్కడున్నాయ్? నిమ్మకాయ పులిహోర చేసావా?'

'పండుగ పుటైనా జీన్సు టీ షర్టు వదిలేసి పద్ధతిగా పంచెకట్టుకోమన్నాను కదా?' అంది అమ్మ, వంట గదిలోంచిబయటకు వస్తూ.

'ముందే పట్టు పంచె లాల్చీ వేసుకున్నావా? డ్రెస్ లో ఎం టీ ఆర్ లా ఉన్నావు తెలుసా? ఇలాగే ఆఫీసుకి వెళ్ళు అమ్మాయిలంతా అందరు ఫ్లాట్ అయిపోతారు.'

'ఆఫీసు సంగతి ఏమో కాని బెల్ట్ లేకపోతే నేను అవుట్,' అంటూ వెళ్లి నాన్న, చెల్లి ప్రక్క కూర్చున్నాను.

'ఒరేయ్... బొబ్బట్లలో పాలు ఇలా కలుపుకుని, నెయ్యి వేసుకుని ముద్దగా కలిపి తినాలి,' అంటూ అమ్మ నా విస్తర్లో చేయిపెట్టి కలిపి తినిపించడం మొదలు పెట్టింది.

'ముందు లాప్టాప్ పక్కన పెట్టు... ఎం రాస్తున్నావ్?'

'ఎం లేదమ్మా ఉగాది గురించి, నువ్వు చేసే హడావిడి గురించి, వంటల గురించి రాస్తున్నాను.'

'అన్నయ్యా! నేను పూల జడ వేసుకున్నాను అని రాశావా? నా కొత్త దిద్దులు చూసావా? ఆయన ఫ్రాన్సులో కొన్నారు. మన కొండపల్లిలో చేసినవి అక్కడ దొరికాయి.'

'రాయలేదు... కానీ, పక్క సందులో ప్రతిమ పూలజడ గురించి రాసాను,' అన్నాను తనని ఉడికించడానికి.

'అమ్మా చూసావా అన్నయ్య ప్రతిమ గురించి రాశాడంట! నా గురించి రాయలేదు.'

'ముందు తిని లేవవే. వాడ్ని తిననివ్వు,' అంటూ మళ్లీ నా నోరు లిటరల్ గా మూయించింది అమ్మ, రవ్వ లడ్డుతో.

గత పదిహేను సంవత్సరాలలో ఏమీ మారలేదు... అమ్మ, నాన్న, చెల్లాయి, ప్రతిమ వాళ్ళ నాన్నలా, ఉగాది
పచ్చడిలా... పండుగలా...

మళ్లీ నేను టైపు చేస్తుంటే అమ్మ నా లాప్టాప్ ఎక్కడ విరగ్గోడుతుందో అని ప్రక్కన పెట్టేస్తున్నాను. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నూతన సంవత్సరం మీ ఇంట్లో సంతోషాలు ప్రేమాభిమానాలు వర్దిల్లుతూ ఉండాలని కోరుకుంటూ... సెలవు...

[వంటలు
చేసి, ఫోటోలు తీసి మా జయ పంపింది; తెలుగు సహాయం మా అమ్ము ఇచ్చింది]

Post a Comment

Adapt